కరోనా మందులు, వ్యాక్సిన్లు - వాస్తవాలు
కరోనా మహమ్మారి ప్రపంచం లోని అన్ని దేశాల ప్రజారోగ్య వ్యవస్థల లోని లోపాలను స్పష్టంగా తెలియజేసింది. ఆరోగ్య రంగం ప్రైవేటు వారి చేతుల్లో ఉంటే ఇలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులను అధిగమించడం సాధ్యంకాదనే గుణపాఠాన్ని కూడా నేర్పించింది. ప్రజారోగ్య వ్యవస్థ ప్రభుత్వ అధీనంలో ఉన్న దేశాలు కరోనా కట్టడిలో సాధించిన ఫలితాలను కళ్ళారా చూసేలా చేసింది.
కరోనాకి ఇంతవరకు కొత్తగా ఏ మందులు కనుక్కోలేదు. మలేరియాకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు, ఎయిడ్స్ కు వాడే మందులతో పాటు కొన్ని ఇతర రోగాలకు పని చేసే మందులు కొంత వరకు పనిచేస్తాయనే అభిప్రాయంతో వీటి మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకం మొదటిగా తెర మీదకు వచ్చింది. మన దేశంలో ఉత్పత్తి చేసిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను మొత్తం ట్రంప్ కోరిక మేరకు అమెరికాకు మన కంపెనీలు ఎగుమతి చేశాయి. అలాగే ఈ మందును ముంబై లోని ధారావి లో కరోనా బాధితులందరిపైనా ప్రయోగించాలని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు పత్రికలలో చూశాం. ఆ తర్వాత కరోనా మరణాలను తగ్గించడంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ పెద్దగా ఉపయోగపడదని తెలుసుకొని ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ పని చేయదని తెలుసుకున్న అమెరికా ఇప్పుడు రెమ్‌డిసివర్ మందును కోవిడ్ రోగులపై ప్రయోగిస్తోంది. ఇది కరోనా రోగుల పాలిటి సంజీవని అని ప్రచారాలు జరుగుతున్నాయి. అందుకనే అమెరికా మన దేశంలో ఉత్పత్తి అయిన రెమ్‌డిసివర్ మొత్తాన్ని కొనుగోలు చేసింది.. దీనిని నిజానికి ఎబోలా వ్యాధి చికిత్సలో ఉపయోగించారు. మరి కోవిడ్ విషయంలో ఇది ఎలా పని చేస్తుందనేది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. అయితే ఇది కోవిడ్ మరణాలు ఏమాత్రం తగ్గించడం లేదన్నది మనం చూస్తున్న వాస్తవం. కానీ ఈ ఔషధం ధర మాత్రం సామాన్యునికి అందుబాటులో లేకుండా, ఒక కోర్సు ధర దాదాపు రూ.30000 నుండి రూ.40000 వరకు ఉంది. అయితేనేం, ఇది మందుల కంపెనీలకు అత్యధిక లాభాలు తెచ్చే ఔషధం. అందుకనే ఈ మందుపై అధికంగా ప్రచారాలు ఊపందుకున్నాయి. దీని ద్వారా మందుల కంపెనీలు ప్రజలకు ప్రాణాలపై ఆశ కలిగిస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు ఈ మందుల బ్లాక్ మార్కెటింగ్‌కి దారితీస్తున్న సంఘటనలను కూడా మనం చూస్తున్నాం.
అలాగే ఇటీవల గ్లెన్‌మార్క్ కంపెనీ ఉత్పత్తి చేసిన ఫ్యావిపెరవీర్ ఔషధంపై కూడా చర్చ జరుగుతుంది. కోవిడ్ కి ఇదేదో సంజీవని అని ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో అనేక ప్రకటనలు, వార్తలు వచ్చాయి. ఇది ఇన్‌ఫ్లుయెంజా వ్యాధి చికిత్సలో ఉపయోగించిన మందు. ఇది కోవిడ్ కి ఎలా పని చేస్తుందనే పూర్తి పరిశోధన వివరాలు లేవు. కానీ కంపెనీ మాత్రం ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఖరీదు ఒక కోర్సుకి దాదాపు రూ.4వేలు (ఒక మాత్ర ఖరీదు రూ.103) ఈ మందుని రోగులకు ప్రభుత్వాలు ఉచితంగా అందించడం లేదు. అంటే ఈ కంపెనీ ఔషధం పరిశోధనకు అయ్యే ఖర్చును కూడా రోగుల జేబు నుండి వసూలు చేస్తుందన్న మాట. ఒక వ్యాధిపై రోగుల సొంత ఖర్చుతో ప్రయోగాలు చేయడం బహుశా ఇదే మొదటిసారి. ఈ ఔషధం మనకంటే జపాన్ లో చాలా చౌక. అలాగే 'హైదరాబాద్ ఆప్టిమస్' కంపెనీ కూడా ఈ మందుని చాలా తక్కువ రేటుకి ఉత్పత్తి చేస్తూ అయిదు దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇంకో విశేషమేమిటంటే వైద్యులకు మాత్రమే తెలియాల్సిన మందుల మోతాదుల వివరాలను మందుల కంపెనీలే సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయడం అనైతిక చర్య, డ్రగ్స్ చట్టాల ఉల్లంఘన. అలాగే కోవిడ్ వైద్యంలో సరైన పూర్తి పరిశోధన వివరాలు లేకపోయినా, కోవిడ్ చికిత్సలో ఈ ఔషధంపై సరైన మార్గదర్శకాలు లేనప్పటికీ ఈ మందు మార్కెట్లోకి రావడానికి అనుమతులు ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. ఇదే అదునుగా భావించిన బాబా రాందేవ్ లాంటి వారు కోవిడ్ వైద్యానికి మందుగా వాళ్ళ ప్రాడక్టుని మార్కెట్లోకి తీసుకు రావడం కూడా మనం చూశాం. అయితే అధికార యంత్రాంగం వెంటనే మేల్కొని చట్టపరమైన చర్యలకు ఉపక్రమించడం ప్రజలకు కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాలను బట్టి కోవిడ్ వైద్యంలో మరణాల శాతాన్ని తగ్గించడానికి కొంతమేరకైనా ఉపయోగపడే వైద్యాలు రెండే. డెక్సా మెథసోన్ (స్టిరాయిడ్) ఔషధం వాడడం ఒక్కటి. ప్లాస్మా థెరపీ రెండవది. అయితే ఇవి కూడా అందరికీ పని చేయవు. ప్లాస్మా థెరపీ కొందరిలో మంచి ఫలితాలను ఇస్తున్న కారణం చేత కోవిడ్ నుండి కోలుకున్న వారందరూ తప్పనిసరిగా రక్తదానం (ప్లాస్మా) చేయడానికి ముందుకు రావాలి. తద్వారా మరికొందరి ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుంది.
అలాగే వ్యాక్సిన్ విషయంలో కూడా చాలా కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు కలిసి గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నాయి. గత అనుభవాలను మనం పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఏ వ్యాక్సిన్ తయారీకైనా ఏళ్ల తరబడి సమయం పట్టేది. అలాగే కరోనా వైరస్‌లో వేగంగా జరుగుతున్న ఉత్పరివర్తనాల కారణంగా ఈ వ్యాక్సిన్‌తో నూటికి నూరు శాతం అందరిలోనూ వ్యాధిని నివారించే పరిస్థితి ఉండకపోవచ్చు. మన దేశ అనుభవాన్ని కూడా పరిశీలిస్తే కేవలం ఒక పోలియో వ్యాక్సిన్ మాత్రమే దాదాపుగా అందరికీ నివారణ కలిగించిందని చెప్పుకోవచ్చు. కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 16 దేశాలలో ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. అవి కూడా బ్రిటన్, అమెరికా, జర్మనీ, రష్యా, చైనాలలో మాత్రమే ముందంజలో ఉన్నాయి. మన దేశంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ, ఆక్స్‌ఫర్డ్ తో కలిసి ఈ సంవత్సరం ఆఖరికి మార్కెట్లోకి వ్యాక్సిన్ తీసుకొస్తారని తెలిపారు. తదుపరి హైదరాబాద్ కు చెందిన 'భారత్ బయోటెక్' సంస్థతో కలిసి, 'జైడస్' సంస్థ వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ఉంది. ఆ క్రమంలో ఈ రెండు సంస్థలు కలిసి ఆగస్టు 15వ తేదీకల్లా కోవిడ్ వ్యాక్సిన్ మార్కెట్లో విడుదల చేస్తామని ప్రకటించడం శాస్త్రవేత్తలందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మూడు దశలలో కొన్ని నెలల పాటు జరగాల్సిన క్లినికల్ ట్రయల్స్‌ని కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేసి ఈ వ్యాక్సిన్‌ని మార్కెట్లో విడుదల చేస్తామని ప్రకటించడంతో అనేక మంది శాస్త్రవేత్తలు, వైద్యులు విమర్శలు గుప్పించిన అనంతరం ఈ వ్యాక్సిన్‌ని వచ్చే సంవత్సరం మొదట్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ ప్రకటన వెలువడింది. ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వ్యాక్సిన్ మాత్రమే కరోనాకు విరుగుడని ఆశగా ఎదురు చూస్తున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి పారదర్శకత లేని ప్రకటనలు చేయడం విచారకరం, బాధ్యతా రాహిత్యం. కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి అమెరికాలో 66000 కోట్లు ఖర్చు చేస్తుంటే మన దేశంలో కేవలం కొన్ని వందల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తుండడం గమనార్హం. ఒకవైపు 'ఆత్మ నిర్భర్' ప్రచారం చేస్తున్న మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ వాక్సిన్ కంపెనీలను పునరుద్ధరించి కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనలు చేపడితే చాలా ఉపయోగకరం. కరోనా వచ్చిన దగ్గర నుండి జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ముఖ్యంగా ఆకస్మిక లాక్‌డౌన్, 16 వేల కోట్ల మంది వలస కార్మికుల సమస్యలను ఉద్దేశించి ప్రకటన లేకపోవడం, దేశంలో తయారైన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును కంపెనీలు లాభాల కోసం ఎగుమతి చేయడం తద్వారా మన మార్కెట్లో దానికి కొరత రావడం, వివిధ రకాల పేర్లతో కరోనా నివారణకు మార్కెట్లో మందులు విడుదల చేయడం, వ్యాక్సిన్ను 45 రోజుల్లో విడుదల చేస్తామనే ప్రకటనలు ఇవ్వడం లాంటి గందరగోళ పరిస్థితులు బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండవేమో? ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, హేతుబద్ధంగా వాస్తవాలను ప్రజలకు తెలియజేసి పట్టికలో పేర్కొన్న చర్యలను వెంటనే చేపట్టాలి.
తక్షణం చేపట్టాల్సిన చర్యలు
కరోనా టెస్టుల సంఖ్య ఇంకా పెంచాలి. పెరుగుతున్న కేసుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలతో కూడిన ఆస్పత్రులను ఏర్పాటు చేయాలి. వైద్యులను, సిబ్బందిని ప్రైవేటు రంగం నుండి కూడా తీసుకొని ఈ అత్యవసర పరిస్థితుల్లో వారి సేవలను ఉపయోగించుకోవాలి. ఢిల్లీ తరహాలో అత్యవసర ఆస్పత్రులను అన్ని మహానగరాలలో ఏర్పాటు చేయాలి. కరోనా మహమ్మారిని దష్టిలో పెట్టుకుని సంబంధిత అన్ని అత్యవసర మందుల ఉత్పత్తి కోసం ఔషధ పరిశ్రమలకు కంపల్సరీ లైసెన్స్ ఇవ్వాలి. కరోనా రోగులకు ఉచితంగా మందులు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలను పునరుద్ధరించి పరిశోధనలు చేపట్టాలి. రేషన్లో సరుకుల మోతాదును పెంచాలి. అలాగే ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగించే విటమిన్-సి, జింక్, బి-కాంప్లెక్స్ మాత్రలు కూడా రేషన్‌తో పాటు పేదలందరికీ ఉచితంగా ఇవ్వాలి. ప్రజల్లో భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, శానిటైజేషన్ మీద అవగాహన కార్యక్రమాలు విస్తతంగా చేపట్టాలి.
- టి. కామేశ్వరరావు
(వ్యాసకర్త ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
సెల్ : 9985250991
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి