వ్యాక్సిన్‌


వ్యాక్సిన్‌ అంటే ఏమిటసలు?

విషానికి విషమే విరుగుడని పెద్దలు సామెత చెప్పేవారు. వ్యాక్సిన్‌ కూడా అలాంటిదే. ఒక వ్యాధి రాకుండా నిరోధించడానికి అదే వ్యాధికారకాన్ని చిన్న మొత్తంలో ఆరోగ్యవంతుల శరీరంలోకి ఎక్కిస్తారు. దాంతో వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొద్ది కొద్దిగా కన్పిస్తాయి. అది చూసి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై ఆ వ్యాధి కారకాలతో పోరాడి పైచేయి సాధిస్తుంది. భవిష్యత్తులో శరీరం ఆ వ్యాధి బారిన పడకుండా నిరోధక శక్తిని సంతరించుకుంటుంది.
ఇలా చేయొచ్చని ఎలా తెలిసిందీ?
అది చాలా పెద్ద కథే! మనిషి వైద్యం చేసుకోవడం మొదలెట్టినప్పటినుంచే వ్యాధులు రాకుండా ఉండటానికి ఏం చేయాలన్న విషయంలోనూ పరిశోధనలు చేస్తూనే వచ్చాడు. బౌద్ధ సన్యాసులు పాముకాటు వల్ల మృత్యువాత పడకుండా ఉండటానికి పాము విషాన్ని తాగేవారని చరిత్ర చెబుతోంది.
ఆ తర్వాత స్మాల్‌పాక్స్‌(మశూచికం) వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి వైద్యులు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఒకసారి మశూచికం వచ్చి తగ్గినవాళ్లు మరోసారి ఆ వ్యాధి బారిన పడకపోవడాన్ని వారు గమనించారు. అందుకని వ్యాధి బాధితులకు సహాయకులుగా గతంలో వ్యాధి వచ్చి తగ్గినవారిని నియమించడం క్రీస్తు పూర్వమే మొదలైంది. ఆ తర్వాత చాలా చిన్న మొత్తంలో రోగుల శరీరం నుంచి వ్యాధిసోకిన కణాల్ని తీసి ఆరోగ్యవంతుల చర్మం కింది పొరలో ప్రవేశపెట్టి వ్యాధి వచ్చిన అనుభూతికి గురిచేసేవారు. దాంతో వారి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోందని గుర్తించారు. అయితే శతాబ్దాల తరబడి ఎవరికి వారు రహస్యంగా దీన్ని ఆచరిస్తూ పోయారే తప్ప బయటకు ప్రకటించలేదు. ఈ విధానం రిస్క్‌తో కూడుకున్నది కావడమూ కొంతమంది చనిపోవడమూ కూడా అందుకు కారణం. చైనా, మిడిల్‌ ఈస్ట్‌, ఆఫ్రికా లాంటి పలుప్రాంతాల్లో గుట్టుగా సాగిపోతున్న ‘వేరియోలేషన్‌’ అనే ఈ విధానం పదిహేడో శతాబ్దంలో ఓ మహిళ ద్వారా బ్రిటన్‌కి రావడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ఎవరామె, ఏం చేసింది?

మేరీ మాంటేగ్‌ సంపన్న కుటుంబానికి చెందిన చదువుకున్న మహిళ. మశూచికం ఆమె సోదరుడి ప్రాణాల్ని తీసింది, ఆమె అందాన్ని హరించింది. ఆ తర్వాత రెండేళ్లకు ఆమె భర్త టర్కీలో రాయబారిగా నియమితుడయ్యాడు. అక్కడ ఉన్నప్పుడు ఈ వేరియోలేషన్‌ గురించి తెలుసుకున్న ఆమె తన కొడుకునైనా మహమ్మారి నుంచి రక్షించు కోవాలని ఆ చికిత్స చేయించింది. ఇంగ్లండ్‌ తిరిగి రాగానే అందరికీ దాని గురించి తెలియచేయాలని రాజవైద్యుల ఎదురుగానే తన చిన్న కూతురికీ చేయించింది. సరిగ్గా అప్పుడే ఇంగ్లండ్‌లోనూ వ్యాధి ప్రబలడంతో పిల్లలకు ఈ చికిత్స చేయించమని తన స్నేహితురాలైన బ్రిటిష్‌ రాకుమారికీ సలహా ఇచ్చింది. ఎంతైనా రాజకుటుంబం కదా... నేరుగా తమ పిల్లలకు కాకుండా ముందు కొందరు ఖైదీల మీద ప్రయోగం చేయించారు. ఆ తర్వాత కొందరు అనాథ పిల్లలకు చేయించారు. అందరూ ఆరోగ్యంగా ఉండడంతో అప్పుడు రాకుమారి తన కూతుళ్లకూ చేయించింది. ఆ తర్వాత పలుదేశాల రాజకుటుంబాలు తమ పిల్లలకు వేరియోలేషన్‌ చేయించాయి. ఓ పక్క వివాదాస్పదం అంటూనే చాలామంది ఆ చికిత్సను కొనసాగించడానికి కారణాలు ఇప్పుడు కరోనా వైరస్‌లాగే ఆరోజుల్లో మశూచికం కూడా ప్రపంచ దేశాలన్నిటినీ చుట్టబెట్టడమూ, వేరియోలేషన్‌ వికటించి చనిపోయేవారికన్నా మశూచికంతో చనిపోయేవారు ఎన్నో రెట్లు ఎక్కువ ఉండడమూను.

మశూచికం ఎలా వ్యాపించేది?

మనవాళ్లు స్ఫోటకం అనీ పెద్ద అమ్మవారు అనీ పిలిచిన ఈ అంటువ్యాధి సోకిన ప్రతి ముగ్గురిలోనూ ఒకరు మరణించేవారు. మరొకరు శాశ్వతంగా చూపు కోల్పోయేవారు. దక్షిణ ఆఫ్రికాలోని వ్యవసాయ సమాజాల్లో ఎప్పుడో పదివేల సంవత్సరాల క్రితం సహజంగా పుట్టిన ఈ వైరస్‌ ్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపిందనడానికి ఆనవాళ్లు ఉన్నాయి. క్రీస్తుపూర్వం నాటి ఈజిప్షియన్‌ మమ్మీల ముఖాలమీద కూడా స్ఫోటకం మచ్చలు కనిపించాయి. ఈ వైరస్‌ లాలాజలం ద్వారా వ్యాపించేది. చిన్న తుంపరలో లెక్కలేనన్ని వైరస్‌లు ఉండి శరవేగంగా వ్యాప్తి చెందేది. వైరస్‌ సోకినవారికి తీవ్ర జ్వరమూ ఒళ్లంతా దద్దుర్లూ వచ్చి అవి పుండ్లు అయిపోయేవి. అంగుళం ఖాళీ లేకుండా శరీరమంతా వచ్చే ఆ పొక్కులు బాధితులకు నరకం చూపేవి. దాన్ని తట్టుకుని బతికి బట్టకట్టినా వారి రూపం అందవిహీనంగా తయారయ్యేది. కొలంబస్‌ మొదటిసారి అమెరికా వెళ్లినప్పుడు అక్కడ స్థానిక అమెరికన్లు ఏడుకోట్లపైన ఉండే వారట. తర్వాత మూడొందల ఏళ్లకి ఆ జనాభా ఎన్నో రెట్లు పెరగాల్సింది. కానీ కేవలం ఆరులక్షల మంది మిగిలారు. దానికి కారణం యూరోప్‌ నుంచి అక్కడికి వెళ్లినవారి వల్ల మశూచికం సోకడమే. ఇలాగే ప్రతి దేశంలోనూ ఏదో ఒక సమయంలో అది విశ్వరూపం చూపుతూ వచ్చింది. మరే ఇతర అంటువ్యాధి వల్లా సంభవించని ఎక్కువ మరణాలు దీనివల్ల సంభవించాయి.

మన దేశంలోనూ ఉండేదా?

చాలా తీవ్రంగా ఉండేది. నిజానికి 1802 లోనే మనదేశంలో మశూచికం వ్యాక్సిన్‌ మొదటిసారి వేశారు. అయితే బ్రిటన్‌ నుంచి దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్‌ని నిల్వచేయడమూ, రవాణా పెద్ద సమస్యగా ఉండేది. పైగా వ్యాక్సిన్‌ వేయించుకున్నందుకు డబ్బు చెల్లించాల్సి వచ్చేది. దాంతో ఇది ప్రజల్లోకి వెళ్లలేదు. పందొమ్మిదో శతాబ్దం చివరలో ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంది. తప్పనిసరి వ్యాక్సినేషన్‌ చట్టాన్నీ, అంటు వ్యాధుల నిరోధక చట్టాన్నీ తెచ్చింది. ఆ తర్వాత కలరా వ్యాపించడంతో అప్పటికే కలరా వ్యాక్సిన్‌ తయారుచేసిన డాక్టర్‌ హాఫ్‌కిన్‌ని ఇండియా వచ్చి దాన్ని పరీక్షించవలసిందిగా కోరింది ప్రభుత్వం. అది బాగానే పనిచేయడంతో ప్లేగ్‌ వ్యాక్సిన్‌పై పరిశోధన చేయమని అడిగింది. 1897లో ఆయన దాన్ని తయారుచేశారు. మన దేశంలో తయారైన మొదటి వ్యాక్సిన్‌ అదే. ఆ తర్వాత ప్రపంచ యుద్ధాల వల్ల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ బాగా వెనకబడింది. 1974 నాటికి ప్రపంచంలోని 86 శాతం మశూచికం కేసులు ఇక్కడే ఉండేవి. దాంతో 1975లో ‘టార్గెట్‌ జీరో’ పేరుతో యుద్ధప్రాతిపదికన మశూచికం నిర్మూలనకు నడుం బిగించారు. ఆ ఏడాది జనవరి నుంచి మే వరకూ ఐదు నెలల్లోనే మొత్తం దాదాపు 62 వేల కేసులొస్తే అందులో 15వేల మంది చనిపోయారు. దంతో ఆరోగ్యశాఖ శక్తులన్నీ కేంద్రీకరించి పనిచేసి టీకాలు వేసి వైరస్‌ని నియంత్రించింది. వ్యాక్సిన్‌ పుణ్యమా అంటూ 1980కల్లా మొత్తంగా ప్రపంచం నుంచే మశూచికం వైరస్‌ని తరిమేయగలిగాం.

ఇప్పుడు వేయిస్తున్న వ్యాక్సిన్లు దేనికి?

మశూచికం పోయింది కానీ ఇంకా ధనుర్వాతం, మెదడువాపు, మీజిల్స్‌, హెపటైటిస్‌ లాంటి చాలా జబ్బులు ఉన్నాయి. వాటి కోసం వ్యాక్సిన్లు వేయించాల్సిందే. పోలియో అయితే 1990వ దశకం మొదట్లో కూడా మనదేశంలో రోజుకు వెెయ్యి వరకూ కేసులు వచ్చేవి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియని ప్రభుత్వాలు సక్రమంగా అమలుచేయడం వల్ల ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. దాంతో ఇప్పుడు పోలియోని పూర్తిగా నిర్మూలించ గలిగాం. ధనుర్వాతంతో 1988లో లక్షా 60వేల మంది పిల్లలు చనిపోయారు. తీవ్రత తగ్గినా ఇది ఇప్పటికీ ఉన్న సమస్యే. ఇవి కాక కొత్త కొత్త వైరస్‌లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. కాబట్టి వ్యాక్సిన్ల సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. ఇప్పుడు కరోనా కూడా వాటికి తోడవబోతోంది.
వ్యాక్సినేషన్‌ని ఎవరు కనిపెట్టారో?
పద్దెనిమిదో శతాబ్దం నాటి సంగతిది. పదహారేళ్ల ఎడ్వర్డ్‌ జెన్నర్‌ ఓ వైద్యుడి దగ్గర మందులు తయారుచేసే సహాయకుడిగా ఉండేవాడు. ఓసారి పాలు తీసుకువచ్చిన యువతి నీరసంగా కన్పిస్తే స్మాల్‌పాక్స్‌ వచ్చిందేమోనని అడిగాడట. ‘నాకు కౌపాక్స్‌ ఉందిగా స్మాల్‌పాక్స్‌ రాదు’ అని చెప్పిందట ఆ యువతి. ఆవులకు పొదుగు మీద చిన్న చిన్న నీటి పుండ్లు పడడాన్ని కౌపాక్స్‌ అనేవారు. ఒక్కోసారి అలాంటి పుండ్లే పాలుతీసే వారి చేతుల మీదా పడేవి. ఆ మాట జెన్నర్‌కి బాగా గుర్తుండిపోయింది. తర్వాత లండన్లో వైద్యుడిగా శిక్షణ పొందేటప్పుడు ఆ విషయాన్ని తోటి వైద్యుడికి చెప్పాడు. దాన్ని లోతుగా పరిశీలించమని ఆయన సలహా ఇచ్చాడు. 1796 మేలో జెన్నర్‌కి ఆ అవకాశం వచ్చింది. కౌపాక్స్‌ సోకిన మహిళ చికిత్సకు రాగా ఆమె చేతి పుండు నుంచి కొద్దిగా రసి తీసి ఓ ఎనిమిదేళ్ల పిల్లాడి చేతికి ఇంజెక్ట్‌ చేశాడు. మరో ఆరు వారాల తర్వాత స్మాల్‌పాక్స్‌ వచ్చి తగ్గిన వ్యక్తి పుండునుంచి కూడా అలాగే తీసి ఆ పిల్లాడికే ఎక్కించాడు. అలా ఎక్కించిన చోట పుండు పడింది. కొద్దిగా జ్వరం వచ్చింది. అంతే, ఆ తర్వాత ఆ అబ్బాయి ఎప్పటిలా ఆరోగ్యంగా ఉన్నాడు. అలా ఒకసారి కాదు ఇరవై సార్లు చేశాడు. అయినా ఆ అబ్బాయికి ఏం కాకపోవడంతో కౌపాక్స్‌ వస్తే స్మాల్‌పాక్స్‌ రాదన్నది నిజమేనని అర్థమైంది. తన ప్రయోగం గురించి జెన్నర్‌ రాసిన లేఖను రాయల్‌ సొసైటీ తిరస్కరించింది. దాంతో సవివరంగా ఓ పుస్తకం రాసి తానే ప్రచురించాడు. అది బయటకు వచ్చిన ఏడాదికల్లా పలు భాషల్లోకి అనువాదం అవడమే కాక డాక్టర్లందరూ ఆ విధానాన్ని అవలంబించడం మొదలుపెట్టారు. లాటిన్‌ భాషలో ఆవుని ‘వాక్సా’ అంటారు. వ్యాక్సినేషన్‌ అన్న పదానికి మూలం అదే.తాను కనిపెట్టిన ఈ విధానం అందరికీ ఉపయోగపడాలని జెన్నర్‌ స్వయంగా వ్యాక్సిన్‌ సేకరించి అడిగినవాళ్లకీ అడగని వాళ్లకీ కూడా పంచేవాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరూ ఎన్నో అవార్డులూ వచ్చినా జెన్నర్‌ పొంగి పోలేదు. పేదలకు ఉచితంగా వ్యాక్సిన్‌ వేసేవాడు. చివరికి అతని కుటుంబసభ్యులు క్షయతో చనిపోగా జెన్నర్‌ గుండెపోటుతో మరణించాడు. అప్పటికే మశూచికం వ్యాక్సిన్‌ని అన్ని దేశాలూ వాడటం మొదలెట్టాయి. ఆ తర్వాత లూయీ పాశ్చర్‌ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. రాబిస్‌, ఆంత్రాక్స్‌ తదితర వ్యాక్సిన్లను తయారుచేయడం ద్వారా వైద్యంలో వ్యాక్సినేషన్‌ విప్లవానికి తెరలేపాడు. కొత్త కొత్త వ్యాక్సిన్స్‌ ఎన్నో తయారవడమే కాదు, వాటి తయారీకి వాడే పదార్థాల్లోనూ మార్పులు వచ్చాయి. జెన్నర్‌ స్మాల్‌పాక్స్‌కి దానిలాగే ఉండే కౌపాక్స్‌ నుంచి లింఫ్‌ ద్రవాన్ని సేకరించి వ్యాక్సిన్‌లా వాడితే ఇప్పుడు మరెన్నో రకాలుగా ప్రయోగశాలలో వ్యాక్సిన్లను తయారుచేస్తున్నారు. అయితే ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోడానికి ఇలా రకరకాలుగా వ్యాక్సిన్లను తయారు చేయడం పలు వివాదాలకూ కారణమైంది.

వివాదం ఎందుకు?

వ్యాక్సిన్‌ తయారీలో వాడే పదార్థాల గురించి కొందరు మతపరమైన అభ్యంతరాలు వ్యక్తంచేసేవారు. పేదలకు ప్రభుత్వాలు ఉచితంగా వేయించడమూ అపోహలకు దారితీసేది. కొన్ని సందర్భాల్లో పుకార్లు, తప్పుడు వార్తలు కూడా వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా పనిచేసేవి. పదిహేనేళ్ల క్రితం నైజీరియాలో పోలియో వ్యాక్సిన్‌లో కుటుంబ నియంత్రణ మందులు కలుపుతున్నారన్న పుకారుతో తల్లిదండ్రులు దాన్ని వ్యతిరేకించారు. దాంతో అక్కడ మళ్లీ పోలియో కేసులు పెరిగాయి. ఇక, అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపు దేశాల్లో కొందరు చదువుకున్న తల్లిదండ్రులే వ్యాక్సినేషన్‌ వల్ల ఆటిజం సమస్య పెరుగుతోందన్న వాదన లేవదీశారు. ఆ వాదన నిరూపణ కాకపోయినా కొందరు వ్యాక్సినేషన్‌ మానేస్తున్నారు. తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలనడం వ్యక్తి స్వేచ్ఛను హరించడమేనంటూ ఇప్పటికీ అమెరికాలాంటి కొన్నిచోట్ల ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వాళ్లే కొందరు ఆ మధ్య కరోనా మాస్క్‌ ధరించడమూ తమ స్వేచ్ఛకు భంగంగానే భావించారు.
అది తప్పు కదా?
వ్యాక్సిన్లు అనేవి వ్యక్తిగత ఆరోగ్య రక్షణకే కాదు, అంటువ్యాధుల్లాంటివి ప్రబలకుండా చూసే సామాజిక బాధ్యత కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి. ఇవాళా రేపూ ఒకటీ రెండూ కాదు పిల్లలకూ పెద్దలకూ కలిపి యాభై రకాలకు పైగా వ్యాక్సిన్లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి వాటిని తీసు కోవాల్సి ఉంటుంది. ఒక్కో వ్యాక్సిన్‌ తయారీకీ పరీక్షించి చూడడానికీ కొన్ని సంవత్సరాలు పడుతుంది. యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నించబట్టి కరోనాకి వ్యాక్సిన్‌ని త్వరగా తేగలుగుతున్నారు. వందలూ వేలూ కాదు, కొన్ని లక్షల మంది శ్రమించి పరిశోధిస్తేనే వ్యాక్సిన్‌ మానవాళికి అందుబాటులోకి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం హెచ్‌ఐవీ, మలేరియా, క్షయ లాంటి పాతిక వ్యాధుల కోసం దాదాపు 240 వ్యాక్సిన్లు ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్నాయి.

ఎన్ని టీకాలు!

మన దేశంలో నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ షెడ్యూల్‌ ప్రకారం పుట్టినప్పటినుంచి పదహారేళ్ల వరకు పిల్లలకు వేయిస్తున్న టీకాలు ఇవీ..! బీసీజీ, ఓపీవీ(ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌), హెపటైటిస్‌ బి, పెంటా(డీపీటీ+హెపటైటిస్‌ బి+హెచ్‌ఐ బి(హిమోఫిలస్‌ ఇన్‌ఫ్లుయెంజా టైప్‌బి), ఐపీవీ(ఇనాక్టివేటెడ్‌ పోలియో వ్యాక్సిన్‌), ఎంఎంఆర్‌(మీజిల్స్‌, మంప్స్‌, రుబెల్లా), జేఈ(జపనీస్‌ ఎన్‌సెఫలిటిస్‌), టీటీ(ధనుర్వాతం)... వీటిల్లో కొన్ని సింగిల్‌ డోస్‌ ఉంటే కొన్ని రెండు, మూడు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి కాక చికెన్‌ పాక్స్‌, హెపటైటిస్‌ ఎ, హెచ్‌పీవీ, ఫ్లూ, టైఫాయిడ్‌, న్యూమోనియా, షింగిల్స్‌ లాంటి వ్యాక్సిన్లూ ఉన్నాయి

మేటి విజయం

ఆధునిక వైద్యంలో వ్యాధి నిరోధకత అత్యంత ముఖ్యమైనదే కాదు, విజయవంతమైన విభాగం కూడా. ప్రజారోగ్యానికి సంబంధించి చాలా తక్కువ ఖర్చుతో అత్యధిక ప్రభావం చూపే విభాగమూ ఇదే. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం- 94 దేశాల్లో పదిరకాల వ్యాక్సిన్లు వేయడానికి రెండున్నర లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ద్వారా 44 లక్షల కోట్ల వైద్య ఖర్చు ఆదా అయినట్లు తేలింది. పలురకాల అంటువ్యాధుల దగ్గరనుంచి క్యాన్సర్ల వరకూ ఈ వ్యాక్సిన్ల ద్వారా నివారించగలుగుతున్నాం. ఐదేళ్ల లోపు పిల్లల మరణాల్ని ఏటా 30 లక్షల వరకూ తగ్గించగలిగాం. నిరుపేద దేశాలన్నిట్లోనూ వ్యాక్సినేషన్‌ని సరిగ్గా అమలుచేస్తే ఇంకో పదిహేను లక్షల మరణాల్నీ తప్పించవచ్చంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. గత రెండు దశాబ్దాలుగా వ్యాధి నిరోధకతకు సంబంధించి పరిశోధన మరింత విస్తృతమైంది. మాలెక్యులార్‌ జెనెటిక్స్‌, మైక్రో బయాలజీ, జీనోమిక్స్‌ లాంటి వాటిని వ్యాక్సినోలజీలో ఉపయోగించడం మొదలుపెట్టారు. దాంతో కొత్త వ్యాధులకు వ్యాక్సిన్లు కనిపెట్టడానికి మరింత వీలు కలుగుతోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid